16 ఏళ్ళకే కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇండియన్ మైఖేల్ జాక్సన్!
on Apr 2, 2024
ప్రభుదేవా... ఇండియన్ మైఖేల్ జాక్సన్.. ఇండియన్ సినిమాల్లోని డాన్సుల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొరియోగ్రాఫర్. మొదట అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను కనబరిచాడు. కొరియోగ్రాఫర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రభుదేవాకి డాన్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అతనికి మంచి ఫుట్‌బాల్ ఆటగాడు అవ్వాలనేది గోల్‌గా ఉండేది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ లక్ష్యాన్ని పక్కన పెట్టి సినిమాల్లోనే మంచి పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతోనే పనిచేశాడు. చిన్నతనం నుంచి ఇప్పటివరకు అతని జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో వివాదాలు, వ్యక్తిగత జీవితంలో అపశృతులు, ఎన్నో అపనిందలు.. ఇన్ని అవరోధాల మధ్య తన కెరీర్‌కు ఎలాంటి భంగం కలగకుండా దాదాపు 30 సంవత్సరాలుగా సినిమాల్లోనే కొనసాగుతున్నాడు. ఏప్రిల్ 3 ప్రభుదేవా పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి తెలుసుకుందాం.
1973 ఏప్రిల్ 3న సుందరం, మహదేవమ్మలకు మొదటి సంతానంగా ప్రభుదేవా మైసూరులో జన్మించాడు. స్కూల్‌కి వెళ్ళే ముందు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కఠినమైన పద్ధతుల్లో ప్రభుదేవాకు నృత్యం నేర్పించారు. స్కూల్ స్టడీస్ పూర్తయిన తర్వాత తనతోపాటు షూటింగులకు తీసుకెళ్లేవారు సుందరం మాస్టర్. అలా ‘మౌనరాగం’ చిత్రంలోని ‘తడి తడి తలపు.. తరగని వలపు’ అనే పాటలో ఫ్లూటు వాయిస్తూ కాసేపు కనిపించే కుర్రాడిగా తెరంగేట్రం చేశాడు ప్రభుదేవా. ఆ తర్వాత తండ్రి దగ్గరే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా రెండు సంవత్సరాలు పనిచేశాడు. తండ్రి ప్రోత్సాహంతో 16 ఏళ్ళ వయసులోనే కమల్‌హాసన్ సినిమాకి కొరియోగ్రాఫర్‌గా తొలిసారి పనిచేశాడు. ఇండియన్ సినిమాల్లోని డాన్సుల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ప్రభుదేవాకే దక్కుతుంది. ఇప్పటివరకు 130 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు ప్రభుదేవా.
శరత్‌కుమార్, రోజా జంటగా పవిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘సూర్యన్’ చిత్రానికి కొరియోగ్రాఫర్‌గా చేస్తున్న సమయంలో అతనిలో హీరో కనిపించాడు డైరెక్టర్‌కి. ఆ క్షణమే తన నెక్స్‌ట్ మూవీతో ప్రభుదేవాని హీరో చెయ్యాలనుకున్నాడు పవిత్రన్. అప్పటికే శంకర్ సినిమా ‘జెంటిల్‌మెన్’ చిత్రంలోని ‘చికుబుకు రైలే..’ పాటతో బాగా పేరు తెచ్చుకున్నాడు ప్రభు. 1994లో ‘ఇందు’ పేరుతో పవిత్రన్ రూపొందిన సినిమాలో ప్రభుదేవా హీరో, రోజా హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే శంకర్ డైరెక్షన్‌లో ‘ప్రేమికుడు’ సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. ఈ రెండు సినిమాలు ఒకే సంవత్సరం విడుదలై ఘనవిజయం సాధించాయి. ఆ తర్వాత హీరోగా పాతిక సినిమాల్లో నటించాడు. కానీ, ఇందు, ప్రేమికుడు తప్ప ఏదీ కమర్షియల్‌గా హిట్ అవ్వలేదు. అందులో ఎక్కువ శాతం నిర్మాతకు నష్టం రాని సినిమాలే ఉండడం విశేషం. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించాడు.
ప్రభుదేవాలో ఒక దర్శకుడు కూడా ఉన్నాడని మొదట గమనించారు నిర్మాత ఎం.ఎస్.రాజు. అందుకే సిద్థార్థ్, త్రిష జంటగా రూపొందిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సూపర్‌హిట్ అయింది. ఆ వెంటనే ప్రభాస్ హీరోగా ‘పౌర్ణమి’ సినిమా కూడా ఇచ్చాడు. కానీ, ఈ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే చిరంజీవితో చేసిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ కూడా డిజాస్టర్ అయింది. తెలుగులో ప్రభుదేవా డైరెక్ట్ చేసిన సినిమాలు ఈ మూడే. డైరెక్టర్‌గా ప్రభు 15 సినిమాలు చేశాడు. అందులో 8 రీమేక్ సినిమాలే. తెలుగులో సూపర్‌హిట్ అయిన పోకిరి చిత్రాన్ని తమిళ్‌లో విజయ్‌తో, హిందీలో సల్మాన్ ఖాన్‌తో చేసి సూపర్‌హిట్ సాధించాడు.
1995లో రమాలత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రభుదేవా. వారికి ముగ్గురు మగపిల్లలు. పెద్ద కుమారుడు 13 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌తో 2008లో చనిపోయాడు. ఆ తర్వాత ప్రభుదేవా జీవితంలోకి నయనతార ప్రవేశించింది. కొన్నాళ్ళు ఇద్దరూ సహజీవనం చేశారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయంచుకున్న తర్వాత భార్య రమాలత్‌కు విడాకులు ఇచ్చాడు. నయనతార వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకుంది రమాలత్. ఆమెకు తోడుగా కొన్ని మహిళా సంఘాలు కూడా నిలిచాయి. ఆయా సంఘాలు నయనతారపై నిరసనలు వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుదేవా, నయనతారల మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి ఇష్టప్రకారమే విడిపోయారు. ఆ తర్వాత నయనతార.. విఘ్నేష్‌ని వివాహం చేసుకుంది. భార్యకు విడాకులు ఇచ్చిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముంబాయిలోని ఫిజియోథెరపిస్ట్ హిమానిని 2020లో పెళ్ళి చేసుకున్నాడు ప్రభుదేవా. వీరికి ఒక కుమారుడు.
కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలు చేసిన ప్రభుదేవాకు పురస్కారాలు లెక్కకు మించి లభించాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అలాగే కొరియోగ్రాఫర్‌గా రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నాడు. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక కలైమామణి అవార్డును కూడా పొందాడు ప్రభుదేవా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా నంది, ఫిలింఫేర్, జీ అవార్డ్స్ అందుకున్నాడు. పోకిరి తమిళ్ రీమేక్‌కి ఫేవరెట్ డైరెక్టర్‌గా విజయ్ సంస్థ ఇచ్చే అవార్డు గెలుచుకున్నాడు. ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్రభుదేవా పుట్టినరోజు ఏప్రిల్ 3. నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ప్రభుదేవాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్.
Also Read